Saturday, 12 March 2016

కార్యం ముగిసిన తరువాత కర్తతో పనిలేదు


ద్రౌపతి వస్త్రాపహరణం ఘట్టంలో పాండవులు జూదం ఆడేటప్పుడు శ్రీకృష్ణుడు సాయం చేయలేదు. అదే ఘట్టంలో ద్రౌపతికి సాయమందించాడు.ఇదే విషయాన్ని అరణ్యవాసంలో శ్రీకృష్ణుడు పాండవులను చూడడం కోసం సతీ సమేతంగా వచ్చినప్పుడు "కృష్ణా! జూదం ఆడే సమయంలో మాకు నువ్వు సాయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! ఎందుకు చేయలేదు అని అడిగాడు.
శ్రీకృష్ణుడు నవ్వి బావా! ఆరోజు నేను సాల్వుడితో యుద్ధంలో ఉండడం వలన నీకు సాయం చేయలేకపోయాను అన్నాడు. ధర్మరాజుకి విషయం అర్థమైంది. ఎందుకంటే అదే సభలో ద్రౌపతికి ఎందుకు సాయం చేశావు? అని అడగలేకపోయాడు. ద్రౌపతికి కష్టం రాగానే అక్కడ ఉన్న ఎవరిని నిలదీసినా ఫలితం లేక శ్రీకృష్ణుడిని శరణు కోరింది. వెంటనే సాయం చేశాడు. ఈవిషయం ధర్మజుడికి తెలుసు. జూదం ఆడే సమయంలో ఏ క్షణంలో శ్రీకృష్ణ నామం జపించినా అలా జరిగేది కాదు. అందువలన ధర్మజుడు ఈవిషయాన్ని అడగడానికి సంశయించాడు. దీనికి మరొక కారణం కూడా ఉంది. పాండవులు రాజభోగాలు అనుభవిస్తూ కూర్చుంటే పాండవులకి, పుడమికి, జగత్తుకి మేలు జరగదు. భారత యుద్ధం జరగదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అంటే జూదం ఆడాలి. పాండవులు ఓడాలి. ఇది అంతర్లీనంగా ఉన్న కథ.
అసలు మహాభారతం పునాది ఎలా పడింది.
యముడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది వేయి సంవత్సరాలు నిరంతరంగా కొనసాగింది. ధర్ముడు యజ్ఞంలో ఉండడం వలన దుష్టులు పెచ్చుపెరిగిపోయారు. ఆయుష్షు మూడిన వారుకూడా బ్రతికి ఉన్నారు. ధర్మాలు నశించాయి. పుడమి భరించలేని పాపాత్ములు పెరిగిపోయారు. పుడమి గో రూపం ధరించి శ్రీకృష్ణుడిని శరణు వేడింది. ఏమి జరిగిందో తెలుసుకున్న శ్రీకృష్ణుడు దుష్ట సంహారం కోసం పట్టిక సిద్దం చేసి దేవతలందరినీ సన్నద్ధం చేశాడు. ఎవరిని ఎప్పుడు ఎలా సంహరించాలి అనే ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎంతటి వీరుడైనా ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదు. అలా ఉపేక్షిస్తే ధర్మం నశిస్తుంది.
ఒక ప్రక్క చిన్న నాటి నుండి రాక్షసుల బీచమణుస్తూ, మంచివారిని కాపాడుతూ, సాల్వ, జరాసంధ వధ ఇలా కొనసాగుతూ ఉంటే! మహాభారత యుద్ధం ఆరంభం అయింది. ముందుగా భీష్ముడు తన మరణాన్ని తానె కోరుకొని అర్జునుడి చేతిలో అంపశయ్యపై పడిపోయాడు. ఎందుకంటే తనని ఓడించడం ఎవరి తరం కాదు. దుష్ట శిక్షణ జరగదు. కనుక తానె స్వయంగా పడిపోవాలని, అలా పడిపోవాలంటే శిఖండిని అడ్డుపెట్టుకోవాలని ధర్మజుడికి సలహా ఇస్తాడు భీష్ముడు. పదవ రోజు సాయంత్రానికి శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముడిని అర్జునుడు పడేశాడు.
అభిమన్యుడు : అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి యుద్ధం చేస్తూ చాలాదూరం వెళ్ళిపోగా ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నుతాడు. ధర్మజుడు అభిమన్యుడిని పిలిచి "మాకు ఎవరికీ పద్మవ్యూహం చేధించడం తెలియదు. కేవలం నీ తండ్రి అర్జునుడికి మాత్రమే తెలుసు. నీకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు. కనుక నువ్వు వెళ్ళగలవా? అని అడుగగా "నా అంతటి వీరుడు ఈ సృష్టిలో లేడు. అర్జునుడు అయినా శ్రీకృష్ణుడు అయినా నాకు లెక్కేలేదు. ఎలాంటి వీరులనైనా ఎదుర్కొనే సత్తా నాఒక్కడిలోనే ఉంది అని అహంకరిస్తాడు. అభిమన్యుడు పద్మవ్యుహాన్ని భేధించుకుంటూ వెళితే వెనుకే పాండవులు వెళ్ళాలని రచన చేస్తారు. కాని సైంధవుడి రూపంలో పాండవులకి పెద్ద గోడ అడ్డుతగులుతుంది. అభిమన్యుడు ఎంతో వీరత్వంతో పద్మవ్యుహాన్నిచేధిస్తూ లోపలికి వెళతాడు. కాని పాండవులు ఎంతకీ రారు.ఈవిషయం ప్రాణం మీదకి వచ్చాక వెనక్కి తిరిగి చుస్తే ప్రక్కన ఎవ్వరూలేరు. వ్యూహం బయటికి వెళ్ళడానికి కళింగులు, మ్లేచ్యులు అడ్డుతగిలి వెళ్ళనివ్వలేదు. దీంతో విపరీతంగా యుద్ధం జరిగింది. అభిమన్యుడు దాటికి తట్టుకోలేక కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు లాంటి మహామహులు పారిపోయారు. మళ్ళి వెనక్కి వచ్చి యుద్ధం చేశారు కాని గెలవలేకపోయారు. దీంతో చేసేదిలేక ద్రోణుడు దుష్ట వ్యూహం పన్ని చుట్టుముట్టి అభిమన్యుడిని సంహరించారు. వీరుడిగా ఉండాల్సిన గర్వం కంటే అహంకారం ఎక్కువై శ్రీకృష్ణుడిని సైతం సంహరిస్తాను అని పలికి తానే సంహరించబడ్డాడు. ఎందఱో యోధాను యోధులు తనని ఒంటరిని చేసి శూలాలతో, ఖడ్గాలతో పొడిచి, శరీరం అంతా బాణాలు నాటినా చివరికి దుశ్యాసనుడి కుమారుడి కొడుకుతో వీరోచిత పోరాటం చేసి ఒకరికి ఒకరి గుద్దుకొని, చేతులతో పొడుచుకొని, గదలతో తన్నుకొని ఒకేసారి ఇద్దరు పుడమిపై కూలి మరణించారు. యితడు పద్మవ్యూహంలో చేసిన పోరాటం అత్యద్భుతం. యితడు వచ్చిన పని ఇక్కడితో సరి.
చేసిన పాపానికి ద్రోణాచార్యుడు "అశ్వద్ధామ హతః కుంజరః" అనే పిలుపుతో ప్రాణాన్ని వదిలేశాడు. దానికి తోడు ద్రోణుడు క్షత్రియుడు కాడు. బ్రాహ్మణుడు. అసలు యుద్ధమే చేయకూడదు. ఇదే విషయాన్ని బ్రహ్మర్షులందరూ మహాభారత యుద్ధం పదమూడవ రోజు వచ్చి ద్రోణుడితో " నువ్వు క్షత్రియుడిలా యుద్ధం చేస్తూ ఎందఱో ప్రాణాలని బలిగోన్నావు. ఇంకా యుద్ధం విరమించు అన్నా వినకుండా యుద్ధం చేశాడు. అభిమన్యుడి దారుణ సంహారానికి కర్త తానె అయ్యాడు.
కర్ణుడు: ఇతడి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా మరొక టపా పెట్టాలి. కనుక తరువాతి పోస్ట్ లో ఉపపాండవుల సంహారంతో సహా అందరి సంహారం వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం.

No comments:

Post a Comment