Wednesday, 16 March 2016

సాంప్రదాయాలు

గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడు
గడపకు ( Threshold) పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయనే సంగతి అందరికీ తెలుసు. తెలీని విషయం ఏమిటంటే గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడని. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినందువల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన ధార్మిక గ్రంధాలు చాటుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తుంటారు. కానీ, ఇలా ఎందుకు పసుపు రాస్తారో, దీని వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటో చాలామందికి తెలీదు. పురాణ గ్రంధాల్లో ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి...
గడపకు పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి.
సమయానికి పెళ్ళి జరగడమే గాక మంచి వరుడు వస్తాడు. మనసు అర్ధం చేసుకునేవాడూ, ఎన్నడూ విడిపోనివాడూ వస్తాడు.
గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టే గృహిణిని ఆమె భర్త ఎన్నడూ కష్టపెట్టడు.
అలాంటి ఇళ్ళలో ఆదాయం బాగుంటుంది. సుఖసంతోషాలు ఉంటాయి.
గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్ళలో పిల్లలు చెప్పిన మాట వింటారు. అభివృద్ధి పథంలో నడుస్తారు.
అలాంటి ఇళ్ళు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయి.
పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి, కుటుంబానికి వన్నె తెస్తారు. గడపకు పసుపు రాసి, కుంకుమ దిద్దే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు.
జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి పసుపు గురు గ్రహాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, సంపదలను సూచిస్తుంది. ఎరుపురంగు శుక్ర గ్రహాన్ని, సుఖాలను, సంపదలను సూచిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా గురు, శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు. సంపదలు లభ్యమౌతాయి.

No comments:

Post a Comment